బెంగళూరు, జూన్ 4: పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్న వారినే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. స్టేడియం ప్రాంగణంలో డ్రైనేజ్‌పై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాబుపై అభిమానులు నిలబడడంతో బరువును తట్టుకోలేక స్లాబు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హఠాత్తుగా స్లాబు కూలిపోవడంతో ప్రజలు భయకంపితులై అక్కడ నుంచి పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నాయి.
కుంభమేళాలో తొక్కిసలాట జరగలేదా?: సీఎం సిద్ధరామయ్య
తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని చెప్పారు. ‘ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇంతకంటే దారుణమైనవి చోటుచేసుకున్నాయి. కుంభమేళాలోనూ తొక్కిసలాట జరిగింది. 50-60 మంది చనిపోయారు. నేను ఘటనను సమర్థించడం లేదు. జరిగిందంతే’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో 11 మంది మరణించినట్లు వెల్లడించారు. ఘటనపై డిప్యుటీ కమిషనర్ స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందజేయనున్నట్లు తెలిపారు.
తొక్కిసలాటలో ప్రాణనష్టం జరిగినట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ధ్రువీకరించారు. అయితే ఇతర వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఎందరు మరణించాన్న విషయాన్ని తాను నిర్ధారించలేనని ఆయన ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ చెప్పారు. భద్రతా ఏర్పాట్ల కోసం 1,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని డీకే తెలిపారు. తొక్కిసలాట, మరణాల కారణంగా కార్యక్రమాన్ని 10-15 నిమిషాల్లో ముగించి వేశామని ఆయన చెప్పారు. మృతులలో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, మహిళలు ఉన్నారు. బౌరింగ్ దవాఖానలో ఆరుగురు మరణించినట్లు ధ్రువీకరించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వైదేహి దవాఖానలో నలుగురు, మణిపాల్ దవాఖానలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం: బీజేపీ
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి, మరణాలు సంభవించడం పట్ల రాష్ట్ర బీజేపీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సమూహాన్ని నియంత్రించడానికి కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 11 మంది మరణించగా, అనేక మంది మృత్యువుతో పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజలను నియంత్రించే చర్యలు లేవని, కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదని, దీంతో కల్లోలం ఏర్పడిందని బీజేపీ పేర్కొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే రీల్స్ షూటింగ్లో, క్రికెటర్లతో ఫొటోలు దిగడంలో బీజీగా ఉన్నారని విమర్శించింది. ప్రధాని విచారం
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన హృదయ విదారకమని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరితంగా కోలుకోవాలని ఆయన ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.
హరీశ్‌రావు దిగ్భ్రాంతి
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. స్టేడియంలో జరిగిన తొకిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. ఈ భయానక ఘటన జన సమీకరణ, ప్రజా భద్రతపై సీరియస్ ప్రశ్నలను లేవనెత్తుతున్నదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బాధాకరం: ఎంపీ రవిచంద్ర
చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది తమ ప్రాణాలు కోల్పోవడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని పేర్కొన్నారు. తొక్కిసలాట చోటుచేసుకోవడం, భద్రతా సిబ్బంది క్రికెట్ అభిమానులను అదుపు చేయలేకపోవడం, 11 మంది మృత్యువాతపడడం దురదృష్టకరమని తెలిపారు. మరణించిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చెప్పారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
బీసీసీఐకి సంబంధం లేదు: సైకియా
బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్ విజయోత్సవ నిర్వాహకులు మరింత మెరుగైన ప్రణాళిక చేసుకుని ఉండాల్సిందని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ జట్టును సత్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీసీఐ పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో ఇటువంటి విజయోత్సవాల ఏర్పాటు కోసం మార్గదర్శకాలు రూపొందించే విషయాన్ని బోర్డు పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. బెంగళూరులో జరిగిన ఘటనను అత్యంత దురదృష్టకరంగా ఆయన అభివర్ణించారు. నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు సైకియా చెప్పారు. ఇందులో నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఆయన తెలిపారు.