EC | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కర్నాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఓట్ల దొంగతనంపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని కోరారు. మహదేవపుర నియోజకవర్గంలోనే నకిలీ ఎంట్రీలు, ఫేక్ అడ్రస్లు, ఒకే చోట రిజిస్ట్రేషన్ ద్వారా 1,00,250 ఓట్లు దొంగిలించారని రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈసీఐ డేటా ఆధారంగా 70 సంవత్సరాల ఓటరు శకున్ రాణి రెండుసార్లు ఓటు వేశారన్న రాహుల్ ఆరోపణలపై నోటీసుల్లో పేర్కొంది. సీఈవో కార్యాలయం ప్రాథమిక విచారణలో ఆమె ఒకేసారి మాత్రమే ఓటు వేసిందని పేర్కొంది. శకున్ రాణి లేదంటే.. మరెవరైనా సరే రెండుసార్లు ఓటు వేశారని మీరు నిర్ధారించిన సంబంధిత పత్రాలను అందించాలని.. తద్వారా వివరణాత్మకంగా విచారణ చేపట్టవచ్చని సీఈవో అన్బుకుమార్ నోటీసుల్లో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రజంటేషన్లో చూపించిన టిక్ మార్క్ చేసిన పత్రం పోలింగ్ అధికారి జారీ చేసిన పత్రం కూడా కాదని వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నికలను ఈసీ కొరియోగ్రఫీ చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలోనే మహదేవపుర నియోజకవర్గంలో ఫేక్ ఓటర్ల నమోదు, ఫేక్ చిరునామాలు, ఒకే చోట బల్క్ రిజిస్ట్రేషన్ ద్వారా లక్షకుపైగా ఓట్లను దొంగిలించినట్లుగా రాహుల్ ఆరోపించారు. ఇది ఎన్నికల కమిషన్ డేటా అని.. ఈ సమాచారాన్ని ఎవరూ తిరస్కరించలేరన్నారు. అయితే, ఈసీని మరోసారి టార్గెట్ చేస్తూ votechori.in వెబ్సైట్ను లాంచ్ చేశారు. ఇందులో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలపునిచ్చారు.