MP Govind Karjol | బెంగళూరు, సెప్టెంబర్ 8: విద్యార్థులు బడుల్లో మరుగుదొడ్లు శుభ్రం చేస్తే తప్పేంటని చిత్రదుర్గ బీజేపీ ఎంపీ, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ ప్రశ్నించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘విద్యార్థులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తే తప్పేంటి? జపాన్‌లో టీచర్లు, విద్యార్థులు ఈ పని చేస్తారు. నేను చదువుకునేటప్పుడు హాస్టల్‌ను ఊడ్చి, కడిగే వాడిని. విద్యార్థులతో ఉపాధ్యాయులు మరుగుదొడ్లు శుభ్రం చేయించే వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారు.
విద్యార్థులకు చీపురు ఇవ్వడాన్ని నేరంగా చూస్తున్నారు. అందుకే శుభ్రం చేసే పనిని విద్యార్థులు తక్కువగా చూస్తున్నారు. కాబట్టి, విద్యార్థులకు శుభ్రత గురించి చెప్పడం తప్పనిసరి.’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, శుభ్రతకు సంబంధించిన పనులను విద్యార్థులతో చేయిస్తే వివక్ష లేకుండా, అందరూ రొటేషన్ పద్ధతిలో చేసేలా చూడాలని, ఐదో తరగతి పైన చదువుతున్న వారితోనే ఈ పని చేయించాలని ప్రొఫెసర్ సీతారాము అభిప్రాయపడ్డారు. అయితే, ఎంపీ వ్యాఖ్యలు ఆశ్యర్యకరంగా ఉన్నాయని, పిల్లలతో మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని చెప్పడం సులువే అని, కానీ చివరకు దళిత సామాజిక వర్గానికి చెందిన పిల్లలే ఈ పని చేయాల్సి వస్తుందని విద్యావేత్త నిరంజనారాధ్య పేర్కొన్నారు.