బెంగళూరు: లొంగిపోయిన నక్సల్స్‌కు సన్మానం చేయడంతోపాటు పునరావాసం ప్యాకేజీ ఇస్తామన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ (Sunil Kumar) మండిపడ్డారు. వారితో ఆయనకు సంబంధాలున్నాయా? అని ప్రశ్నించారు. అడవుల్లో ఉండే నక్సల్స్‌ను అర్బన్ నక్సల్స్‌గా మార్చుతున్నారని ఆరోపించారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి ప్రజాస్వామ్య స్రవంతిలో చేరాలని సీఎం సిద్ధరామయ్య గత వారం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు నక్సల్స్ అయిన ముండగారు లత, సుందరి కుత్లూర్, వనజాక్షి బాలెహోలె, మారెప్ప అరోలి (కర్ణాటక), కే వసంత్ (తమిళనాడు), జీషా (కేరళ) బుధవారం సిద్ధరామయ్య ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్‌ను సత్కరించడంతోపాటు వారికి పునరావాస ప్యాకేజీ అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
కాగా, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ పునరావాస విధానాన్ని ఆయన విమర్శించారు. ‘సిద్ధరామయ్య నక్సల్స్‌తో సన్నిహితంగా ఉన్నారా? లేక నక్సల్స్‌తో సన్నిహితంగా ఉన్నవారు ఆయనకు సన్నిహితులా?’ అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి వామపక్ష తీవ్రవాదంపై పోరాడుతున్న యాంటీ నక్సల్ ఫోర్స్‌ను నిరుత్సాహపరిచేలా ప్రభుత్వ ప్యాకేజీ ఉందని ఆరోపించారు. ‘ఇది సరెండర్ ప్యాకేజీ కాదు. అర్బన్ నక్సల్స్ సంఖ్యను పెంచే ప్రమాదకర చర్య’ అని మండిపడ్డారు. నక్సల్స్ లొంగుబాటు కోసం ప్యాకేజీలు ఇవ్వడం కంటే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ప్రజాభివృద్ధికిపై దృష్టి సారించాలని అన్నారు.