(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ముడా, వాల్మీకి కుంభకోణాలతో ఇప్పటికే అప్రతిష్ఠ మూటగట్టుకొన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనుల్లో రూ. 46,300 కోట్ల మేర భారీ అక్రమాలు చోటుచేసుకొన్నాయని యాంటీ-కరప్షన్ ఫోరమ్ అధ్యక్షుడు ఎన్నార్ రమేశ్ సంచలన ఆరోపణలు చేశారు. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ)కి చెందిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కుంభకోణంలో భాగమైనట్టు మండిపడ్డారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు 4,113 పేజీలతో కూడిన డాక్యుమెంట్లను అందజేశారు. 2013-14 నుంచి 2023-24 మధ్య గడిచిన 9.5 ఏండ్లలో ఈ భారీ కుంభకోణం చోటుచేసుకొన్నట్టు రమేశ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ‘గడిచిన 9.5 ఏండ్లలో రోడ్ల మరమ్మతుల కోసం కేటాయించిన రూ. 46,300 కోట్లలో దాదాపు 75 శాతం ప్రజాధనం పక్కదారిపట్టింది. విడుదలైన నిధులకు, చేపట్టిన పనులకు ఎక్కడా పొంతనలేదు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మున్సిపల్ స్కామ్. ఈ కుంభకోణంలో బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉమాశంకర్తో పాటు మరో 18 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు భాగమయ్యారు. దీనిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)కింద కేసు నమోదు చేసి ఈడీ అధికారులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాలి’ అని రమేశ్ డిమాండ్ చేశారు.