బెంగళూరు, సెప్టెంబర్ 29: తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ రైతు, కన్నడ సంఘాలు శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్ చేపట్టాయి. బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. బెంగళూరు విమానాశ్రయం వద్దకు చేరుకొన్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
చిక్కమగళూరులో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. మండ్యలో రైతు సంఘాల నేతలు రైలురోకో చేపట్టారు. ‘కన్నడ ఒక్కుట’ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు 1,900కు పైగా కన్నడ సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రభావంతో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రజారవాణా చాలా వరకు నిలిచింది. మైసూర్, మండ్య, చామరాజనగర్‌లలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి.