బెంగళూరు: భాషా వివాదంపై కన్నడ సంఘాలు శనివారం నిర్వహించిన కర్ణాటక బంద్ ప్రశాంతంగా ముగిసింది. బెళగావిలో గత నెలలో ఓ బస్ కండక్టర్‌కు మరాఠీ మాట్లాడటం రాదనే నెపంతో ఆయనపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్‌ను నిర్వహించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇదిలావుండగా, నిరసనకారులు కోరినప్పటికీ కొన్ని దుకాణాల యజమానులు యథావిధిగానే తమ కార్యకలాపాలను కొనసాగించారు.
జస్టిస్ వర్మపై విచారణకు త్రిసభ్య కమిటీ
న్యూఢిల్లీ, మార్చి 22: అధికారిక నివాసంలో మంటలు చెలరేగి భారీ మొత్తంలో నగదు బయటపడినట్టు జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం ఓ త్రిసభ్య కమిటీని నియమించారు. జస్టిస్ వర్మకు ఎటువంటి అధికారిక విధులను అప్పగించవద్దని కూడా సీజేఐ ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ నుంచి నివేదిక అందిన తర్వాత సీజేఐ ఖన్నా విచారణ కమిటీని నియమించారు.