EVM | ముంబై, డిసెంబర్ 3: ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సోలాపూర్ జిల్లాలోని మర్కడ్వాడి గ్రామ ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం ఓటింగ్‌పై అపనమ్మకం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారా మంగళవారం రీ పోలింగ్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా సోమవారం నుంచి ఈ నెల 5 వరకు గ్రామంలో కర్ఫ్యూ విధించి వారి ప్రయత్నాలను భగ్నం చేశారు. ఈ గ్రామం ఎస్సీలకు రిజర్వ్ చేసిన మల్షిరాస్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. తాజా ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామ్ సత్పుటేను ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థి ఉత్తమ్ జన్కర్ 13,147 ఓట్ల తేడాతో ఓడించారు.
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం ఇక్కడ సత్పుటేకు 1,003, జన్కర్కు 843 ఓట్లు వచ్చాయి. అయితే తమ మద్దతుదారుడే ఎన్నికల్లో నెగ్గినా.. బీజేపీకి గ్రామంలో అన్ని ఓట్లు రావడం ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)కి ఎక్కువ మంది మద్దతుదారులున్న గ్రామస్తులకు ఆగ్రహం కలిగించింది. తమ గ్రామంలో సత్పుటేకు అన్ని ఓట్లు వచ్చే ప్రసక్తే లేదని, ఈవీఎంలలో గంగరగోళమే దీనికి కారణమని వారు ఆరోపించారు. ఈ ఓటింగ్‌లో పాల్గొనాలంటూ గ్రామమంతా పెద్దయెత్తున బ్యానర్లు కూడా వెలిశాయి. అయితే ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలంటూ గ్రామస్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారు.
‘ పారదర్శకంగా నిర్వహించిన ఎన్నికల్లో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నవంబర్ 23నే ముగిసింది. ఇక్కడ మూడు బూత్‌ల్లో జరిగిన పోలింగ్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదు’ అని మల్హిరాస్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి విజయ్ పంగర్కర్ తెలిపారు. గ్రామస్తుల చర్యలపై సోలాపూర్ జిల్లా యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాంటి ప్రయత్నాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయని హెచ్చరించింది. ‘పరిస్థితులు ఎలా ఉన్నా ఓటింగ్ నిర్వహించడానికి ప్రజలు సిద్ధమయ్యారు’ అని ఎన్నికైన ఉత్తమ్రావ్ జన్కర్ పేర్కొన్నారు.