Sitaram Yechury : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త తనను కలిచివేసిందని రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ కపిల్ సిబల్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని, తాము సుదీర్ఘకాలం ప్రయాణించామని చెప్పారు. 2005 నుంచి 2014 వరకూ ఆయన పార్లమెంట్లో తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు.
తాము ఎన్నో అంశాలపై చర్చించి పరిష్కరించేవారమని అన్నారు. తమ మధ్య కొన్ని అంశాల్లో అభిప్రాయ బేధాలున్నా ఏచూరి మాత్రం మనసులో ఏం పెట్టుకోకుండా ఉండేవారని, ఆయన ఎన్నడూ ఆగ్రహం కనబరిచేవారు కాదని చెప్పారు. పార్లమెంట్లో ఏచూరి ప్రసంగిస్తుంటే సభ్యులంతా ఆసక్తిగా వినేవారని, సభ మొత్తం నిశ్శబ్ధంగా ఉండేదని తెలిపారు. భారత్‌కు సంబంధించిన ప్రతి అంశంపైనా ఆయనకు గట్టి పట్టు ఉండేదని, నిజమైన లౌకిక స్ఫూర్తితో వ్యవహరించే కొద్ది మంది వ్యక్తుల్లో ఏచూరి ఒకరని అన్నారు.
కాగా, సీతారాం ఏచూరి న్యుమోనియాతో బాధపడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. గత నెల 19 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఏచూరి తీవ్ర అస్వస్ధతకు లోనై కన్నుమూశారు. సీతారాం ఏచూరి మరణం పట్ల పార్టీలకు అతీతంగా పలువురు నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం, విలువలకు ఏచూరి తన జీవితాంతం కట్టుబడి పనిచేశారని పేర్కొన్నారు.
Read More :