చెన్నై: లేడీస్ హాస్టల్లో ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలింది. (Fridge Compressor Explodes) ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. మరో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. హాస్టల్లో ఉంటున్న 24 మంది మహిళలను పోలీసులు కాపాడారు. తమిళనాడులోని మదురైలో ఈ సంఘటన జరిగింది. పెరియార్ బస్టాండ్ సమీపంలో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలింది. ఆ హాస్టల్లో ఉన్న చెక్కలకు మంటలు వ్యాపించాయి. దీంతో పొగలు దట్టంగా అలముకున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరాడక ఇద్దరు మహిళలు మరణించారు. మరో ముగ్గురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రభుత్వ మిడిల్ స్కూల్ ఉపాధ్యాయురాలైన 50 ఏళ్ల పరిమళ సౌందర్య, ప్రైవేట్ క్యాటరింగ్ ఇనిస్టిట్యూట్‌లో టీచర్ అయిన శరణ్యను మృతులుగా గుర్తించారు. ఉమెన్స్ హాస్టల్లోని 24 మంది మహిళలను రక్షించారు. హాస్టల్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్న భవనానికి సంబంధించిన ఆస్తిపై వివాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దాని లైసెన్స్‌ను పునరుద్ధరించలేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.