Kapil Sibal : చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (Unlawful Activities Prevention Act – UAPA) లో సవరణలు చేసి పాకిస్థాన్‌ను (Pakistan) ఉగ్రవాదదేశంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) కపిల్ సిబల్ (Kapil Sibal) కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. భారత్‌కు అతిపెద్ద సమస్య ఉగ్రవాదమే కాబట్టి దానిని పూర్తిగా పెకలించివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో సవరణ తీసుకువచ్చి పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా జాబితా చేస్తూ షెడ్యూల్‌ను జోడించాలని పేర్కొన్నారు.
ఉగ్రవాద నిర్మూలన భారత్- పాకిస్థాన్‌కే కాకుండా ప్రపంచ దేశాల పురోగతికి ఉపయోగపడుతుందని సిబల్ అన్నారు. కశ్మీర్ ప్రజలు నిశ్చింతగా ఉండాలంటే భారత విదేశాంగ శాఖ ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచ వేదికలపైకి వెళ్లినప్పుడు ఉగ్రవాద సమస్యపై చర్చించాలని, ఉగ్రసంస్థలకు ప్రపంచ దేశాల నుంచి నిధులు అందకుండా అడ్డుకోవాలని సూచించారు. పాక్ ఉగ్రకుట్రలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టడానికి భారత్ నుంచి అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ప్రపంచ దేశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిబల్ స్వాగతించారు.
ప్రతిపక్షాలతో సమావేశంలో వారు ఇచ్చిన సూచనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగీకరించారని అన్నారు. ఈ విధంగా దేశంలోని అన్ని పార్టీలు ఉగ్రవాద నిర్మూలనకు ఏకమైనప్పుడే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన అనంతరం భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. అయినప్పటికీ పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుండడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావని ప్రధాని మోదీ ఇప్పటికే పాక్‌కు స్పష్టంచేశారు. అణుబాంబు బెదిరింపులను భారత్ సహించదని, ఉగ్రవాద స్థావరాలపై భారత్ కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు. పాకిస్థాన్‌కు నిధులిస్తే వాటితో ఉగ్రవాదులను పోషిస్తుందని, కాబట్టి ఆ దేశానికి ఎలాంటి సాయం చేయొద్దని ఐఎంఎఫ్‌ను కోరారు.