Kanwar Yatra : ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్రపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. యాత్రా మార్గంలోని దుకాణదారులు తమ దుకాణాల నేమ్ ప్లేట్లలో వారి పేర్లను చేర్చాలని స్థానిక అధికారులు ఉత్తర్వులు చేయడం వివాదానికి తెరలేపింది. ముస్లిం దుకాణదారుల నుంచి యాత్రికులు ఏమీ కొనుగోలు చేయకుండా చేయాలనే కుట్రతోనే యూపీ బీజేపీ సర్కారు ఇలాంటి నిబంధన పెట్టిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ కన్వర్ యాత్రా మార్గంలో ఓ యాత్రికుల బృందం దాబాను ధ్వంసం చేసింది. ఆ దాబాలో కన్వర్ యాత్రికులకు భోజనంతోపాటు ఆనియన్ సలాడ్ ఇవ్వడం ఈ దాడికి దారితీసింది. తాము నిష్టతో దీక్ష చేసి మహా శివుడి దర్శనం కోసం వెళ్తున్నామని, శివుడికి పవిత్ర జలంతో అభిషేకం చేసేవరకు తాము ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ముట్టకూడదని దాడికి పాల్పిడిన బృందం నాయకుడు చెప్పాడు.
ఇది అందరికీ తెలిసిన విషయమేనని, అయినా ఆ దాబా యజమాని కన్వర్ యాత్రలో ఉన్న మాకు భోజనంతోపాటు ఉల్లిగడ్డలు ఎలా సర్వ్ చేయిస్తారని వారు నిలదీశారు. కాగా, కన్వర్ యాత్రికులకు ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ నిషేధమనే సంగతి తనకు ఇప్పటి వరకు తెలియదని దాబా యజమాని ప్రమోద్ కుమార్ తెలిపాడు. తాను కావాలని అలా చేయలేదని చెప్పాడు.