హాజీపూర్: బీహార్లోని వైశాలి జిల్లాలో జరుగుతున్న కన్వర్ యాత్రలో విషాదం చోటుచేసుకొన్నది. విద్యుదాఘాతంతో తొమ్మిది మంది భక్తులు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న వాహనం హైటెన్షన్ విద్యుత్తు లైన్ను తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. జలాభిషేకం నిర్వహించేందుకు భక్తులు సోనేపూర్లోని బాబా హరిహర్ నాథ్ ఆలయానికి వెళ్తుండగా సూల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి 11.15 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందని వైశాలి జిల్లా కలెక్టర్ యష్పాల్ మీనా తెలిపారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామని, వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. బాధితులంతా వైశాలి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు.