Kamal Nath: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ (Kamal Nath) తమ కంచుకోట అయిన చింద్వారా లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడబోమని స్పష్టంచేశారు. కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ ఈసారి చింద్వారా నుంచి కాకుండా జబల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఇవాళ ఆయన స్పష్టత ఇచ్చారు.
తన కుమారుడు నకుల్ జబల్ పూర్ నుంచి పోటీ చేయాలని అనుకోవడం లేదని, చింద్వారా తను పోటీ చేస్తాడని కమల్‌నాథ్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా చింద్వారాను తాము వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలు తమ అభీష్టం మేరకే పార్టీ మారారని కమల్‌నాథ్ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కాగా, చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం కమల్‌నాథ్‌కు కంచుకోట. 1980 నుంచి తొమ్మిదిసార్లు ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు నకుల్ నాథ్ ఒకసారి గెలిచారు. 1980, 1984, 1989, 1991, 1998, 1999, 2004, 2009, 2014లో కమల్ నాథ్ గెలుపొందారు. 1997లో ఒకసారి మాత్రమే కమల్ నాథ్ ఓడిపోయారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్ లాల్ పాట్వా చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.
2019లో కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ బరిలోకి దిగారు. 37,536 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సారి కూడా తాను చింద్వారా నుంచి బరిలోకి దిగుతానని నకుల్ నాథ్ ప్రకటించారు. ఇంతలో అతను జబల్పూర్ నుంచి బరిలో దిగాలనుకుంటున్నాడని రూమర్స్ రావడంతో కమల్ నాథ్ స్పందించారు.