భోపాల్ : ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో మహాకాళ్ లోక్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై బీజేపీ సర్కార్ లక్ష్యంగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ విమర్శలు గుప్పించారు. ఉజ్జయినిలోని మహాకాళ్ లోక్ నిర్మాణ పనుల్లో అవినీతి వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయని అన్నారు. ఈ వార్తలతో కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని కాషాయ సర్కార్‌లో అవినీతి, స్కామ్‌లు అంతర్భాగమయ్యాయని కమల్ నాథ్ ట్వీట్ చేశారు. శివరాజ్ చౌహాన్ హయాంలో ప్రతి పధకం, ప్రతి పనిలో అది పోషకాహార పధకం లేదా పేదలు రేషన్ మరొకటైనా అవినీతి సాధారణమేనని ఆరోపించారు. వ్యాపం, ఈ టెండర్ ఇతర అవినీతి ఆరోపణలను కమల్ నాథ్ ప్రస్తావించారు.
మహాకాళ్ లోక్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై ఉన్నత స్ధాయి దర్యాప్తు చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ 11న మహాకాళ్ కారిడార్ ప్రారంభం సందర్భంగా జన సమీకరణ, రవాణా, ఆహార ఏర్పాట్లలో అవినీతి జరిగిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇటీవల కాషాయ సర్కార్‌పై ఆరోపణలు చేసింది.