న్యూఢిల్లీ, జూన్ 7: తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో హిందీ భాష గురించి కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దడం అనే వివాదంపై కమల్ హాసన్ వైఖరి ఏమిటి? అన్న మీడియా ప్రశ్నకు ‘నేను పంజాబ్‌కు అండగా నిలుస్తా, కర్ణాటకకు మద్దతు ఇస్తా, ఆంధ్రాకు మద్దతు ఇస్తా’ అని ఆయన సమాధానం ఇచ్చారు. ‘భాషను బలవంతంగా రుద్దకండి.. మేము నేర్చుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. ‘ఎందుకంటే అంతిమంగా ఇది విద్య. మనం విద్య నేర్చుకోవడానికి సులభమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గంలో అడ్డంకులు సృష్టించొద్దు’ అని ఆయన అన్నారు. ఒక నిర్దిష్ట భాషను బలవంతంగా రుద్దడం వల్ల అభ్యాసన ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.