KA Sengottaiyan : అన్నాడీఎంకే (AIADMK) పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ తాను కోర్టుకు వెళ్తానని తమిళనాడు (Tamil Nadu) విద్యాశాఖ మాజీ మంత్రి (Former Education Minister) కేఏ సెంగొట్టైయన్ (KA Sengottaiyan) తెలిపారు. పార్టీలో అర్ధ శతాబ్దానికి పైగా పనిచేసిన తనకు కనీసం షోకాజ్ నోటీసు (Showcause notice) ఇవ్వకుండా, వివరణ (Explanation) కోరకుండా ఏకపక్షంగా బహిష్కరించడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు.
అంతేగాక ఈ బహిష్కరణ తనను మానసిక వేదనకు గురిచేసిందని, కన్నీళ్లు ఆగడం లేదని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని సెంగోట్టైయన్ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా పార్టీ నుంచి గతంలో బహిష్కరణకు గురైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, జయలలిత నెచ్చెలి శశికళ, టీటీవీ దినకరన్‌లను తిరిగి చేర్చుకోవాలని సెంగొట్టైయన్ సూచించడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.
అయితే బహిష్కృత నేతలను చేర్చుకోవాలని తాను పార్టీకి ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని, కేవలం చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోరానని స్పష్టంచేశారు. ఎంజీఆర్, జయలలిత కలలను సాకారం చేసేందుకే ఈ సూచన చేశానని తెలిపారు. పార్టీ జనరల్ సెక్రెటరీ పళనిస్వామి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని సెంగొట్టైయన్ గుర్తుచేసుకున్నారు. ఎంజీఆర్ హయాం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నానని, తన నిబద్ధతను ఎంజీఆర్, జయలలిత సైతం మెచ్చుకున్నారని తెలిపారు. జయలలిత మరణానంతరం శశికళ చక్రం తిప్పినప్పుడు పార్టీ చీలిపోకుండా ఉండేందుకు తనకు వచ్చిన నాయకత్వ అవకాశాన్ని సైతం వదులుకుని పళనిస్వామికి మద్దతిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇదిలావుంటే సెంగోట్టైయన్ బహిష్కరణపై ఏఐఏడీఎంకే అధిష్ఠానం వివరణ ఇచ్చింది. కొన్ని తెలియని కారణాలతో పార్టీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తులతో ఆయన సంబంధాలు కొనసాగించారని, క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపించింది. సెంగోట్టైయన్తో పార్టీ సభ్యులెవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు.