K Suresh : దేశ చరిత్రలో మునుపెన్నడూ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం ఓటింగ్ జరగలేదు. ఎప్పుడైనా అధికార పార్టీ లేదా కూటమి ఎంపీనే స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. కానీ ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కె సురేష్ (K Suresh) ను స్పీకర్ అభ్యర్థిగా బరిలో దించడంతో ఓటింగ్ అనివార్యమైంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ఎన్డీఏ (NDA) చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో మంగళవారం ఉదయం అధికార కూటమి తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష కూటమి తరఫున సీనియర్ ఎంపీ కె సురేష్ నామినేషన్లు వేశారు.
ఈ క్రమంలో ‘ఎవరీ కె సురేష్..?’ అనే ప్రశ్న విస్తృతంగా వినిపిస్తోంది. ప్రొటెం స్పీకర్ ఎవరనే సందర్భంలో కూడా సభలో సీనియర్ కావడంతో కె సురేష్ పేరు బాగా వినిపించింది. అయితే ఆయనను కాదని ఎన్డీఏ సర్కారు భర్తృహరి మహతాబ్ వైపు మోగ్గుచూపడంపై కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఇప్పుడు స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఆయన పేరు చర్చనీయాంశమైంది.
ఈయన పూర్తిపేరు కొడికొన్నిల్ సురేష్ (Kodikunnil Suresh ). కాంగ్రెస్ నాయకుడైన ఈయన ఇప్పటికి 8 పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన కేరళలోని మావెలికర (Mavelikara) నియోజవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) లో సభ్యుడిగా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో ఆయన కొనసాగుతున్నారు.
అంతేగాక కేరళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కె సురేష్ ఉన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికయ్యారు. ఈయన తొలిసారి 1989లో కేరళలోని అడూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1991, 1996, 1999లలో కూడా ఆయన విజయం సాధించారు. అయితే 1998లో, 2004 సాధారణ ఎన్నికల్లో కె సురేష్ ఓటమి చవిచూశారు.
2009లో మావెలికర నుంచి మరోసారి గెలిచారు. అయితే క్రిస్టియన్ అయిన ఆయన అఫిడవిట్లో తప్పుడు కుల ధ్రువీకరణపత్రం సమర్పించారనే ఆరోపణలు రావడంతో అనర్హత వేటు పడింది. అయితే అనంతరం సుప్రీంకోర్టు తన తీర్పును వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో కూడా కె సురేష్ వరుసగా విజయాలు సాధించారు.