చెన్నై: సుమారు 35 ఏళ్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్‌లోకి ఎక్కాడు. తన రికార్డ్‌ను పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడు తాజాగా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యాడు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన 65 ఏళ్ల కె పద్మరాజన్ (K Padmarajan) 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు ఓటమిపాలయ్యాడు. అయినప్పటికీ తనకు గెలుపు ముఖ్యం కాదని ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధానమని చెబుతున్నాడు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని ధర్మపురి జిల్లా నుంచి పోటీకి సిద్ధమయ్యాడు.
కాగా, ‘ఎలక్షన్ కింగ్’గా పేరుగాంచిన పద్మరాజన్, రాష్ట్రపతి నుంచి స్థానిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వంటి రాజకీయ ఉద్ధండులపై కూడా పోటీ చేసి ఓడిపోయాడు. ‘అభ్యర్థులంతా ఎన్నికలలో విజయం సాధించాలని కోరుకుంటారు. నేను మాత్రం కాదు. ఎన్నికల్లో పోటీ చేయడమే నా విజయం. ఓటమి పరంపరలో మళ్లీ ఓడిపోయినా సంతోషమే’ అని అన్నాడు.
మరోవైపు టైర్ రిపేర్ షాప్ నిర్వహించే పద్మరాజన్ హోమియోపతి మందుల అమ్మకంతోపాటు స్థానిక మీడియాకు ఎడిటర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఎన్నికల్లో నామినేషన్ కోసం ఇప్పటి వరకు లక్షలు చెల్లించిన అతడు అన్నిసార్లు డిపాజిట్ కోల్పోయాడు. 2011లో మెట్టూరులో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు తన ఓటు తప్ప ఎవరూ వేయరని అనుకున్న ఆయన అత్యధికంగా 6,273 ఓట్లు సాధించాడు.
కాగా, ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మాత్రం విజయం సాధించాడు. అత్యంత ఓటమి అభ్యర్థిగా రికార్డుకెక్కాడు. ఈ నేపథ్యంలో తన ఊపిరి ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని చెప్పాడు. ఒకవేళ ఎప్పుడైన తాను గెలిస్తే గుండెపోటుతో చనిపోతానేమోనంటూ నవ్వుతూ అన్నాడు.