రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం చంపయీ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎం కూటమి ప్రభుత్వం నెగ్గింది. 81 మంది ఎమ్మెల్యేలు ఉండే అసెంబ్లీలో చంపయీ సర్కార్ ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష తీర్మానానికి అనుకూలంగా 47 మంది శాసనసభ్యులు ఓటు వేయగా.. ప్రతిపక్ష బీజేపీ కూటమికి చెందిన 29 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.
తీర్మానంపై ఓటింగ్‌కు అసెంబ్లీకి మొత్తం 77 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా, స్వతంత్ర ఎమ్మెల్యే సరయు రాజ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి బలపరీక్ష నెగ్గడంతో కూటమి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఊహాగానాలకు తెరపడింది. ఈడీ కస్టడీలో ఉన్న మాజీ సీఎం హేమంత్ సొరేన్ కోర్టు అనుమతితో ఓటింగ్‌లో పాల్గొన్నారు.
అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం చంపయీ సొరేన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని హేమంత్ సొరేన్పై తప్పుడు కేసులు బనాయించిందని విమర్శించారు.
ఆదివాసీలపై బీజేపీ చిన్నచూపు..
తనపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని మాజీ సీఎం హేమంత్ సొరేన్ బీజేపీకి సవాల్ విసిరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తన అరెస్టుపై కేంద్రం పన్నిన కుట్రలో రాజ్‌భవన్ కీలక పాత్ర పోషించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 31 భారత చర్రితలో ఒక చీకటి అధ్యాయం అని, గవర్నర్ ఆదేశాల మేరకు ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని అన్నారు.
రాజ్‌భవన్‌లో ఒక సీఎంను అరెస్టును చేయడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారని పేర్కొన్నారు. తన అరెస్టుకు 2022 నుంచి కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. జార్ఖండ్‌లో ఒక ఆదివాసీ వ్యక్తి సీఎంగా ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకూడదని అనుకొంటున్నదని, వారు తమ పాలనలో కూడా దీన్ని అనుమతించరని అన్నారు. ఆదివాసీలను బీజేపీ అంటరానివారిగా చూస్తున్నదని విమర్శించారు.