న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ రామసుబ్రమణియన్ సోమవారం నియమితులయ్యారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఉద్యోగి మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే విచారణ జరిపే అధికారం ఎన్హెచ్ఆర్సీకి ఉంది. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా జూన్ 1న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు విజయ భారతి సయాని కొనసాగుతున్నారు. ప్రధాని అధ్యక్షతన ఉండే ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) లేక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని ఎన్హెచ్ఆర్సీ చైర్‌పర్సన్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. డిసెంబర్ 18న ఈ కమిటీ సమావేశమైంది. కమిటీ సిఫారసు మేరకు జస్టిస్ రామసుబ్రమణియన్‌ను ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌గా రాష్ట్రపతి నియమించారు.