న్యూఢిల్లీ, జూలై 28: న్యాయమూర్తులే లక్ష్యంగా కొన్ని ఆన్లైన్ వెబ్ పోర్టల్స్‌లో కొనసాగుతున్న లక్షిత దాడులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తంచేశారు. తమకూ వ్యక్తిగత సమస్యలు ఉంటాయని, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందేందుకు సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ కమ్యూనిటీపై దాడులు పెరిగిపోతున్నాయని..
ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరుపాలని న్యాయవాది కోలిన్ గొంజాల్వే ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘ఈ పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నదంటూ ఒక వెబ్‌పోర్టల్‌లో నేను ఓ వార్త చదివా. ఆ న్యూస్ చూడగానే షాక్‌కి గురయ్యా. నాకు కొవిడ్ సోకింది.
ఆ లక్షణాలతో కేసును ఎలా విచారించాలి? అందుకే విచారణ ఆలస్యమైంది. న్యాయమూర్తులకు కూడా వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లు ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు మాకూ సమయం ఇవ్వాలి కదా!’ అని అన్నారు. ‘జడ్జీలపై విమర్శలు చేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. అలాంటి వార్తలను అసలు ఎవరు ప్రచురిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ‘సరే, ఈ పిటిషన్‌ను లిస్టింగ్ చేస్తున్నాం. లేకపోతే, మళ్లీ ధర్మాసనం తాత్సారం చేసిందంటూ ఇంకో న్యూస్ పబ్లిష్ చేసినా ఆశ్చర్యంలేదు’ అని పేర్కొన్నారు. ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ కూడా ఉన్నారు.