న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు సుప్రీం ధర్మాసనం రూట్ క్లియర్ చేసింది. రాష్ట్రాలకు ఆ కోటాను వాడుకోవచ్చు అని కోర్టు పేర్కొన్నది. అయితే ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న జస్టిస్ బీఆర్ గవాయి(Justice BR Gavai).. తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్న క్రిమిలేయర్‌ను గుర్తించేందుకు ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని జస్టిస్ గవాయి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జస్టిస్ బీఆర్ గవాయి దళిత వర్గానికి చెందిన వ్యక్తి. వచ్చే ఏడాది ఆయన సుప్రీంకోర్టు సీజేగా మారే అవకాశాలు ఉన్నాయి. కేజీ బాలకృష్ణణ్ తర్వాత .. చీఫ్ జస్టిస్ కానున్న రెండవ దళితుడిగా గవాయి నిలువనున్నారు. వెనుకబడిన వర్గాల్లో ఉన్న క్రిమిలేయర్ వ్యక్తులు.. ఎలా కోటా లాభాలను పొందుతున్నారో తన తీర్పులో వివరించారు. దీని వల్ల మెజారిటీ ప్రజలు తమ ప్రయోజనాలను కోల్పోతున్నట్లు వెల్లడించారు.
ఒక కంపార్ట్మెంట్లోకి ఓ వ్యక్తి వెళ్లిన తర్వాత, ఆ కంపార్ట్మెంట్లోకి ఎవరూ రాకుండా ఆ వ్యక్తి ప్రయత్నిస్తాడని, కేవలం సామాజిక న్యాయం ప్రకారం వాళ్లకు ఆ బెనిఫిట్ వచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం అందని వర్గాలను ప్రభుత్వాలు గుర్తించాలని, అందుకే క్రిమీలేయర్ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని జస్టిస్ గవాయి తెలిపారు. ఇలా చేయడం ద్వారానే నిజమైన సమానత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
1949లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగాన్ని జస్టిస్ గవాయి తన తీర్పులో గుర్తు చేశారు. సామాజిక ప్రజాస్వామ్యం కుదిరితేనే రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కేవలం కొన్ని వర్గాలు మాత్రమే రిజర్వేషన్ లాభాలను అనుభవిస్తున్నారని, ఎస్సీ-ఎస్టీల్లోని కొందరు ఇంకా వేధింపులకు గురవుతున్న వాస్తవాన్ని కొట్టిపారేయలేమని, ఎక్కువ సంఖ్యలో వివక్ష జరుగుతున్న నేపథ్యంలోనే వర్గీకరణకు కోర్టు అనుకూలంగా ఉన్నట్లు జస్టిస్ గవాయి తెలిపారు.
ఎస్సీల్లోని క్రిమీలేయర్‌కు చెందిన చిన్నారిని.. అదే వర్గానికి చెందిన చెత్తకుప్పలు వేరుకుని పిల్లోడితో పోల్చలేమన్నారు. ఇది చీటింగ్ అవుతుందన్నారు. క్రిమీలేయర్ విధానంపై జస్టిస్ గవాయి చేసిన సూచన పట్ల ధర్మాసనంలోని మరో ముగ్గురు న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించారు.
ఏ కులమైనా కేవలం తొలి తరానికే రిజర్వేషన్ ఇవ్వాలని, ఆ కుటుంబంలోని రెండవ జనరేషన్‌కు రిజర్వేషన్ ప్రయోజనాలను అందకుండా చేయాలని జస్టిస్ పంకజ్ మిఠల్ తెలిపారు. అయితే జనరల్ క్యాటగిరీతో సమానంగా రెండవ జనరేషన్ ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలన్నారు. రాజ్యాంగం ప్రకారమే ఎస్సీ, ఎస్టీల్లో క్రిమీలేయర్‌ను గుర్తించాలని జస్టిస్ ఎస్సీ శర్మ తెలిపారు. ఓబీసీల్లో క్రిమీలేయర్ విధానం అమలులో ఉన్నదని, దాన్ని ఇప్పుడు ఎస్సీలోనూ అమలు చేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు.