కోల్కతా, అక్టోబర్ 5: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మరోసారి నిరసనను ప్రారంభించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు జూనియర్ డాక్టర్లు శనివారం నిరాహార దీక్షకు దిగారు. ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు దాదాపు నెల రోజులు విధులు బహిష్కరించి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్లు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇవ్వడంతో ఇటీవల ఆందోళనను విరమించి విధుల్లో చేరారు. అయితే, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి 24 గంటల నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం స్పందించకపోవడంతోనే నిరాహార దీక్ష చేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యుల ఫ్రంట్ తెలిపింది.