కోల్‌కతా, అక్టోబర్ 11: కోల్‌కతాలోని ఆర్జీ కర్ దవాఖాన జూనియర్ డాక్టర్లు(జుడాలు) చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి ఆరో రోజుకు చేరింది. దీక్ష చేస్తున్న వారిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆర్జీ కర్ దవాఖానలో చేర్చారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. కాగా, దీక్షలో ఉన్న మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారింది. ఆర్జీ కర్ దవాఖానలో హత్యాచారానికి గురైన మహిళా డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, హెల్త్ సెక్రటరీ ఎన్ఎస్ నిగమ్‌ను విధుల నుంచి తొలగించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైద్యుల సంఘం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాసింది. జూడాలకు ఏదైనా ప్రాణహాని జరిగితే దేశ వ్యాప్తంగా పూర్తిగా వైద్య సేవలను నిలిపివేస్తామని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది.