లక్నో: బైక్‌పై వెళ్తున్న జర్నలిస్ట్‌ను దుండగులు వాహనంతో ఢీకొట్టారు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. (Journalist shot dead) కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. రాఘవేంద్ర బాజ్‌పాయ్ ఒక హిందీ దినపత్రికకు స్థానిక విలేకరిగా పని చేస్తున్నాడు. ఆర్టీఏ కార్యకర్త కూడా అయిన ఆయనకు శనివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. దీంతో ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు.
కాగా, లక్నో-ఢిల్లీ జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న జర్నలిస్ట్ రాఘవేంద్రను ఒక వాహనం ఢీకొట్టింది. ఆ తర్వాత అతడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిగాయి. రక్తం మడుగుల్లో పడి ఉన్న రాఘవేంద్ర రోడ్డు ప్రమాదానికి గురై మరణించినట్లుగా తొలుత పోలీసులు భావించారు.
మరోవైపు మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతడి శరీరంపై మూడు బుల్లెట్ గాయాలున్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో జర్నలిస్ట్ రాఘవేంద్రను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. జర్నలిస్ట్ హత్యా సంఘటన స్థానికంగా కలకలం రేపింది.