రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ పరిశోధక జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూ, ఎన్డీటీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ముకేశ్ చంద్రకర్ ఇటీవల బస్తర్ ప్రాంతంలోని గంగలూరు-హిరోలీ రోడ్డు ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టారు. ఈ ప్రాజెక్టు టెండరు విలువ ప్రారంభంలో రూ.50 కోట్లు కాగా, ప్రాజెక్టు డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేకుండా వ్యయాన్ని రూ.120 కోట్లకు పెంచినట్లు ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వార్తా కథనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ నిర్మాణం, వ్యయంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ అయిన సురేశ్ చంద్రకర్ సోదరుడు రితేశ్ చంద్రకర్ ఈ నెల 1 రాత్రి ముకేశ్, సురేశ్‌ల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముకేశ్ ఫోన్ స్విచాఫ్ కావడంతో ఆయన సోదరుడు యుకేశ్ అనేక చోట్ల వెతికి ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముకేశ్ మృతదేహం బాగా ఉబ్బిపోయిన స్థితిలో చట్టన్పరలోని సురేశ్‌కు చెందిన ఇంటి ప్రాంగణంలోని సెప్టిక్ ట్యాంక్‌లో కనిపించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ సురేశ్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.