డెహ్రాడూన్, జనవరి 5: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పట్టణ ప్రజలు ఇప్పుడు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఏ క్షణాన తమ ఇండ్లు కూలిపోతాయో తెలియని దుస్థితి వారిది. సుమారు 40 వేల జనాభా కలిగిన ఈ పట్టణంలో భూమి క్రమంగా కుంగిపోతున్నది. భూమి పొరల్లో సంభవిస్తున్న మార్పులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
భూమి కుంగిపోవడం వల్ల ఇప్పటివరకు దాదాపు 570 ఇండ్లకు పగుళ్లు వచ్చి కూలిపోయే స్థితికి చేరాయి. పగుళ్లు ఏర్పడినప్పుడల్లా ప్రజలే వాటిని పూడుస్తున్నారు. దాదాపుగా మూడు వేల మంది ప్రజలు ప్రాణాలకు తెగించి పగుళ్లు వచ్చిన ఇండ్లలోనే కాలం గడుపుతున్నారు. కొన్ని కుటుంబాలు జోషీమఠ్‌ను వదిలివెళ్తున్నాయి. మరికొందరిని అధికారులే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.