Land sinking | ఉత్తరాఖండ్ జోషీమఠ్ దృశ్యాలు ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో కూడా ఆవిష్కృతమవుతున్నాయి. మూడు గ్రామాల్లోని భూమి, ఇళ్లు కుంగిపోతున్నాయి. మనాలీ హైవే పనుల్లో కొండల్ని పిండి చేయడం వల్లనే ఇళ్లు బీటలు వారుతున్నాయని అక్కడి వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కుంగిపోతుండటంతో ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
హిమాచల్‌లోని మండీ జిల్లాలో కూడా జోషిమఠ్ తరహా పరిస్థితి ఏర్పడింది. మండీ జిల్లాలోని 3 గ్రామాల భూములు, ఇళ్లకు ముప్పు పొంచి ఉన్నది. మండీలోని ఆటో తహసీల్‌లోని థాలౌట్ పంచాయతీలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం కోసం లెక్కలేకుండా కొండరాళ్లను పగటగొట్టడం వల్ల భౌగోళిక పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇక్కడి ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. భూమి కూడా కుంగిపోవడంతో తహసీల్ ఆటోలోని తహులా ప్రాంతంలోని స్థానిక నివాసితుల్లో భయాందోళన వాతావరణం నెలకొన్నది. మనాలీ హైవే ప్రాజెక్టు పనులు చేపట్టకపోయి ఉంటే బహుశా ఇంత ప్రమాదం ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తగు రీతిన చర్యలు తీసుకోని తమను ఆదుకోవాలని ఈ మూడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మండీ జిల్లాలోని సెరాజ్ లోయలోని నగాని, థాలౌట్, ఫాగు అనే మూడు గ్రామాల్లో భూమి కుంగిపోయి కనిపించింది. జోషీమఠ్ మాదిరిగా ఇళ్ళలో పగుళ్లు రావడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మూడు గ్రామాల్లో కనీసం 32 ఇళ్లు, మూడు ఆలయాలకు ప్రమాదం పొంచి ఉన్నది. పలువురు భయంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. ఇదిలా ఉండగా, 2018 లోనే ఇలాంటి ప్రమాదం తలెత్తిందని, సర్వే కూడా నిర్వహించామని ఓ అధికారి తెలిపారు.అసెస్మెంట్ ఫలితం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. 2018-19 నుంచి ఈ గ్రామాల్లో కొండలు విరిగిపడటంతో ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, 10 గ్రామాల్లో చేసిన సర్వే నివేదిక అందాల్సి ఉన్నదని మండీ ఏడీఎం అశ్వినీ కుమార్ తెలిపారు.