UP Polls : ఆర్ఎల్డీ, సమాజ్‌వాదీ సంకీర్ణ కూటమితో ములాయం, అజిత్ సింగ్, చరణ్ సింగ్ కలలను నెరవేరుస్తామని, ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదని, వచ్చేసారి మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఆర్ ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌధరీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సంయుక్తంగా ముజఫర్ నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. తామిద్దరమూ రైతు బిడ్డలమేనని, రైతుల కోసం చివరి వరకూ ఉద్యమిస్తూనే వుంటామని ప్రకటించారు. రైతులను బలోపేతం చేయడానికి చౌధరీ చరణ్ సింగ్ ఎంతో చేశారని, ఓ రోడ్ మ్యాప్‌ను కూడా చూపించారన్నారు. రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి కూడా ఆయన కష్టపడ్డారని, ఆయన వారసత్వాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
రైతు భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అఖిలేశ్ పేర్కొన్నారు. తాము గనక అధికారంలోకి వస్తే, నల్ల సాగు చట్టాలను అమలు చేయమని, కనీస మద్దతు ధర ప్రకారమే కొనుగోళ్లు చేస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. అలాగే రైతులకు 300 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగానే ఇస్తామని పునరుద్ఘాటించారు. ఇక.. చెరుకు పంట చెల్లింపుల కోసం ఓ కార్పస్ ఫండ్, వ్యవసాయ రివాల్వింగ్ ఫండ్‌ను కూడా సృష్టిస్తామని, వీటితో చెరుకు రైతులు తమ చెల్లింపుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలు చేసే అవకాశాలున్నాయని ఇరువురు నేతలూ ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని అఖిలేశ్ పేర్కొన్నారు.
ఇక ఆర్ ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌధరీ మాట్లాడుతూ… యోగి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో వున్నారని, తమ కూటమిపై ఎంతో ఆశతో ఎదిరి చూస్తున్నారని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారు అత్యంత అప్రమత్తతతో ఉండాలని జయంత్ విజ్ఞప్తి చేశారు.