జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన మతఘర్షణలతో లింకు ఉన్న 211 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై మొత్తం 19 కేసులు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈద్ పండుగ సంబరాలకు ముందు జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. 211 మందిలో మొత్తం 191 మంది ఐపీసీ 151 సెక్షన్ ప్రకారం అరెస్టు చేశారు. జోధ్‌పూర్‌లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లాథర్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ చక్రవర్తి సింగ్ రాథోడ్ చెప్పారు. మే 6వ తేదీ వరకు జోధ్‌పూర్‌లో కర్ఫ్యూను అమలు చేయనున్నారు. నగరంలోని జలోరీ గేట్ సర్కిల్ వద్ద మతపరమైన జెండాలను ఆవిష్కరించే అంశంలో రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.