Akhilesh Yadav : మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ (BJP) ని గద్దె దించితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. వివిద ఉద్యోగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలన్న యూపీపీఎస్సీ (UPPSC) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభ్యర్థులు ప్రయాగ్రాజ్లోని యూపీపీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా వారికి మద్దతుగా ప్రకటించారు.
అన్యాయంగా బుల్డోజర్ను ప్రయోగించే బీజేపీ మెరుగైన పాలన అందించి ఉంటే విద్యార్థుల ఆగ్రహానికి భయపడి ఇళ్లలో దాక్కునే అవసరం వచ్చేది కాదని అఖిలేష్ వ్యాఖ్యానించారు. సంవత్సరాలుగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, బీజేపీ ప్రభుత్వ తీరుతో విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన అసమర్థ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి ఉండటానికి వీల్లేదని అన్నారు. ఉద్యోగాల కల్పన అనేది వారి అజెండాలో లేదని చెప్పారు.
విద్యావంతులు, ఉద్యోగాలు చేసే మధ్యతరగతి ప్రజలు ఇకపై బీజేపీ భావోద్వేగాలకు లొంగిపోరని అన్నారు. ఒకప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో బీజేపీ తప్పుడు ప్రచారానికి బలైన వారి తల్లిదండ్రులు.. ఇప్పుడు బీజేపీ అసలు రంగును తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ విభజన రాజకీయాలు, మత రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీకి మానసిక బానిసలుగా మారేందుకు ఇప్పుడు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.