హైదరాబాద్, ఆగస్టు 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీనిచ్చి మాటతప్పిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాగో కొత్త ఉద్యోగాలను ఇవ్వట్లేదు కనీసం ఉన్న ఉద్యోగాలైనా పోకుండా కాపాడే చర్యలు తీసుకొంటుందా? అంటే అదీలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావంతో అగ్రరాజ్యానికి ఎగుమతులు చేసే కీలక రంగాలపై పెను ప్రభావం పడనున్నది. 25 శాతం సుంకాల ప్రభావంతో దేశీయంగా తయారయ్యే వస్తు, ఉత్పత్తుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.
దీంతో ఆ వస్తువులకు అమెరికాలో గిరాకీ తగ్గవచ్చు. దీంతో అక్కడ డిమాండ్ లేకపోవడంతో ఇక్కడ వాటి ఉత్పత్తి నిలిచిపోవచ్చు. ఫలితంగా ఆయా రంగాలపై ఆధారపడి పనిచేసే లక్షలాది మంది కార్మికులు ఇప్పుడు రోడ్డున పడే దుస్థితి దాపురించింది. దేశ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వని మోదీ ప్రభుత్వం.. సుంకాల వాతను తప్పించే దౌత్య విధానాలను ఆలోచించి.. కనీసం ఉన్న ఉద్యోగాలనైనా కాపాడేలా యోచించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
పెరిగిన సుంకాల కారణంగా కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధినిచ్చే టెక్స్టైల్, జ్యువెల్లరీ, ఎలక్ట్రిక్, మెకానికల్ మెషినరీ, రొయ్యలు-జంతు ఉత్పత్తులకు సంబంధించిన రంగాలపై పెద్ద యెత్తున ప్రభావం పడనున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 35.6 బిలియన్ డాలర్ల(రూ.2.56 లక్షల కోట్లు) విలువైన దుస్తులను భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తే, ఇందులో 29 శాతం అంటే 10.7 బిలియన్ డాలర్ల(రూ.88,000 కోట్లు) ఉత్పత్తులను ఒక్క అమెరికాకే ఎక్స్పోర్ట్ చేసినట్టు అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) ఛైర్మన్ సుధీర్ సేక్రీ తెలిపారు. 4.5 కోట్ల మంది ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
భారతీయ నగలపై గతంలో అమెరికా 10 శాతం సుంకాలు విధిస్తేనే, 50 వేల మంది కార్మికులు ప్రభావితమయ్యారని ఆలిండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేశ్ రోక్డే తెలిపారు. ప్రస్తుత సుంకాలతో జ్యువెల్లరీ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న కనీసం లక్ష మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదమున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సుంకాలతో తమ పాదరక్షల బిజినెస్ దెబ్బతినే ప్రమాదమున్నదని ఫరీదా గ్రూప్ ఛైర్పర్సన్ రఫీఖ్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తులకు బయట డిమాండ్ లేకపోతే, కార్మికులను తొలగించడం తప్ప తమకు మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మేం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కంపెనీలను మూసేయడం, ఉద్యోగులను తీసేయడం కంటే ఏమీ చేయలేని పరిస్థితి. అలా జరుగొద్దనుకొంటే ఎగుమతిదారులు చవగ్గా తమ ఉత్పత్తులను విక్రయించాల్సిందే. అప్పుడే మా వస్తువులకు అమెరికాలో డిమాండ్ ఉంటుంది. ఇది మాకు నష్టమే. కేంద్రమే మాకు సాయం చేయాలి.
– ఏఈపీసీ ఛైర్మన్ సుధీర్ సేక్రీ
ట్రంప్ విధించిన సుంకాలు ఇండియన్ టెక్స్టైల్ ఎగుమతులను దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవాలి. ఉద్యోగాలు కోల్పోకుండా కార్మికులకు అండగా నిలబడాలి.
-భారతీయ వస్త్ర పరిశ్రమ సమాఖ్య