J&K Rain : జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మరణించారు. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి.
వరదల కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలాల కింద పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది.
గడిచిన ఐదేళ్లలో జమ్ముకశ్మీర్‌లో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాగా దీనిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడంవల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.