శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర నేతలను కొత్త ఏడాది తొలి రోజునే మరోసారి గృహ నిర్బంధం చేశారు. వారి ఇండ్ల ముందు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై డీలిమిటేషన్ కమిషన్ ఇటీవల ముసాయిదా ప్రతిపాదనను విడుదల చేసింది. కశ్మీర్‌లోని ఒక స్థానానికి వ్యతిరేకంగా జమ్ము ప్రావిన్స్‌కు ఆరు అదనపు సీట్లను కమిషన్ ప్రతిపాదించింది.
అయితే పూర్వ రాష్ట్రంలోని రెండు ప్రావిన్సుల జనాభా నిష్పత్తికి విరుద్ధంగా ఇది ఉన్నదని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూటమి ఆరోపించింది. డీలిమిటేషన్ కమిషన్ ముసాయిదా ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర రాజకీయ నేతల ఇళ్ల వెలుపల పోలీసులు, భద్రతా ట్రక్కులను మోహరించారు. ఎవరినీ లోపలికి లేదా బయటకు వెళ్లడానికి అనుమతించడం లేదు.
కాగా, తాజా గృహ నిర్బంధంపై ఒమర్ అబ్దుల్లా శనివారం ట్వీట్ చేశారు. ‘శుభోదయం, 2022కి స్వాగతం. కొత్త ఏడాది కూడా అలాగే ఉంది. జమ్ముకశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రజలను వారి ఇళ్లలో బంధిస్తున్నారు. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు పరిపాలనా యంత్రాంగం భయపడుతోంది. శాంతియుత నిరసనలను చెదరగొట్టడానికి మా ఇంటి గేట్ల వెలుపల ట్రక్కులను మోహరించారు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు’ అని పేర్కొన్నారు.
Talk about a lawless police state, the police have even locked the internal gate connecting my father’s home to my sister’s. Yet our leaders have the cheek to tell the world that India is the largest democracy, hah!! pic.twitter.com/flNICRGk58
— Omar Abdullah (@OmarAbdullah) January 1, 2022