చండీగఢ్: జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేతను దుండగులు కాల్చి చంపారు. (JJP Leader Shot Dead) ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం పానిపట్‌లోని వికాస్ నగర్లో జేజేపీ నేత రవీందర్ మిన్నాపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన మరణించారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, కాల్పుల విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో మరణించిన జేజేపీ నేత రవీందర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన హత్యకు కుటుంబ గొడవలు కారణమని పోలీసులు తెలిపారు. వివాదం పరిష్కారం కోసం సమావేశమైనప్పుడు ఘర్షణ చెలరేగిందని చెప్పారు. పారిపోయిన నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పానిపట్ సిటీ స్థానం నుంచి జేజేపీ అభ్యర్థిగా రవీందర్ పోటీ చేసి ఓడిపోయారు.