Jithendra Singh : సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సులో మార్పులు జరగబోతున్నాయని ఊహాగానాలు వెలువడుతున్న వేళ.. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును మార్చే ప్రతిపాదన ఏదీ తమవద్ద లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
లోక్సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏండ్లుగా ఉన్నది. యువతకు ఉపాధి కల్పించే విధానాలు, కార్యక్రమాలను రూపొందించడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడ భర్తీ చేయాలని సంబంధిత శాఖలు, విభాగాలను ఆదేశిస్తున్నట్లు చెప్పారు.
రోజ్గార్ మేళాల ద్వారా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, విద్య, ఆరోగ్య రంగాల్లోని సంస్థల్లో మిషన్ మోడ్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.