Bihar | పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు హిందూస్తానీ అవాం మోర్చా పార్టీ షాకిచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మంత్రి సంతోష్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుమన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంజీ కుమారుడే సంతోష్ సుమన్. అయితే హిందూస్తానీ అవం మోర్చా పార్టీని జేడీయూలో విలీనం చేయాలని ఒత్తిడి వచ్చినందుకే మంత్రి పదవికి సంతోష్ రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా సంతోష్ సుమన్ మాట్లాడుతూ.. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపానని తెలిపారు. జేడీయూ సీనియర్ నాయకుడు, మంత్రి విజయ్ కుమార్ చౌదరిని వ్యక్తిగతంగా కలిసి, రాజీనామాకు గల కారణాలను వివరించానని సుమన్ పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశాను.. మహాఘటబంధన్ నుంచి తమ పార్టీ వైదొలగలేదని సుమన్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల ఉన్న గౌరవంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి, మహాఘటబంధన్లో చేరినట్లు సుమన్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తమ పార్టీని మహాఘటబంధన్లో కొనసాగిస్తారా..? లేక బహిష్కరిస్తారా..? అనేది సీఎం నిర్ణయించాలి. దాని ప్రకారం తాము నడుచుకుంటామని సుమన్ పేర్కొన్నారు. జేడీయూ తన ముందు ఉంచిన ప్రతిపాదన నచ్చకనే, తమ పార్టీని రక్షించుకునేందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.