న్యూఢిల్లీ: బటన్ నొక్కితే వేల కిలోమీటర్లు దూసుకెళ్లడానికి దక్షిణ చైనాలోని వ్యవసాయ క్షేత్రాల్లో సిద్ధంగా ఉన్న అణు క్షిపణుల్లో ఇంధనానికి బదులుగా నీరు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాల నివేదికలు వెల్లడించాయి. 2024లో చైనా క్షిపణి వ్యవస్థ అధినేత ఉద్వాసనకు, జనరల్ జాంగ్ యూజియా పతనానికి అదే కారణమని కూడా నివేదికలు పేర్కొన్నాయి.
చైనా మిలిటరీ కమిషన్‌లో అధ్యక్షుడు తర్వాత రెండో అతి పెద్ద అధికారి అయిన జాంగ్ అణ్వస్త్ర సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలపై జనవరి 19న ప్రభుత్వం నిర్బంధించింది. ప్రమోషన్ల కోసం లంచాలు తీసుకున్నారని, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ సంసిద్ధత విషయంలో రాజీపడినట్లు జాంగ్‌పై ప్రభుత్వం అభియోగాలు మోపింది. అణు క్షిపణి ఆయుధాగారాన్ని పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ నిర్వహిస్తుంది. అణు భద్రతా లోపాలకు జాంగ్ కూడా బాధ్యుడన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా విద్రోహం జరిగితే తప్ప క్షిపణుల్లో ఇంధనానికి బదులుగా నీరు ఉండదని ఆసియా టైమ్స్ మరో కథనంలో పేర్కొంది.