మా భవిష్యత్తును నాశనం చేయొద్దు
‘అగ్నిపథ్’పై జార్ఖండ్ అభ్యర్థుల ఆవేదన
రాంచీ, జూన్ 18: ఆర్మీ ఉద్యోగార్థుల కసరత్తుతో జార్ఖండ్‌లోని జామ్దోబాలో ఉన్న జరియా లోదానా గ్రౌండ్ వారం రోజుల క్రితం వరకూ ఎంతో సందడిగా ఉండేది. అయితే, గత నాలుగురోజులుగా ఆ మైదానంలో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. వ్యాయామం, రన్నింగ్ వంటి కసరత్తులు గ్రౌండ్లో చేయాల్సిన యువకులు ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా నగర వీధుల్లో ఆందోళనల్లో పాల్గొనడమే దీనికి కారణం. రోహిత్ కుమార్ సింగ్ ఓ పండ్ల వ్యాపారి కుమారుడు. సాయుధ దళాల్లో పనిచేయాలన్న ఉద్దేశంతో గత కొన్నేండ్లుగా తీవ్రంగా శ్రమించాడు. ఫిజికల్, మెడికల్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, కరోనా పేరిట రాతపరీక్షను కేంద్రం రెండేండ్లు వాయిదా వేసింది. కరోనా ఉద్ధృతి తగ్గింది.. ఇక పరీక్ష నిర్వహిస్తుందనుకున్న కేంద్రం ‘అగ్నిపథ్’ పేరిట తాత్కాలిక నియామక ప్రక్రియను తీసుకురావడంతో రోహిత్ కలలన్నీ భగ్నమయ్యాయి.
బతికిఉన్నంతవరకూ దేశానికి తాను సేవ చేయాలని అనుకున్నానని, నాలుగేండ్ల కోసం ఇంత శ్రమపడాల్సిన అవసరమేంటని అతను ప్రశ్నిస్తున్నాడు. ‘అగ్నిపథ్’ స్కీమ్ తమ భవిష్యత్తును కాలరాయొద్దని కేంద్రాన్ని వేడుకొంటున్నాడు. ఈ స్కీమ్ తన కలల్ని చిదిమేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరో అభ్యర్థి సాగర్ కుమార్ మాట్లాడుతూ.. తమ భవిష్యత్తును నాశనం చేసేలాఉన్న అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాడు. సాయుధ, పోలీసు శాఖల ఉద్యోగాల్లో చేరడానికే గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని, ఆర్థికంగా, సామాజికంగా వారి వృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రాంచీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ సింగ్ అన్నారు.