Kalpana Soren | గిరిజనుల హక్కులు, డిమాండ్ల పరిష్కారంతోపాటు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేసే సత్తా ఉందా? అని బీజేపీకి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే కల్పనా సోరెన్ సవాల్ విసిరారు. సర్నా ఆధ్యాత్మిక కోడ్ అమలు చేయాలన్న గిరిజనుల డిమాండ్ కు మద్దతునిస్తుందా? అని బీజేపీని ఆమె ప్రశ్నించారు. త్వరలో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ధన్బాద్ జిల్లాలోని తుండిలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ బీజేపీ బూటకపు హామీల బుట్టలో జార్ఖండ్ ప్రజలు పడబోరని స్పష్టం చేశారు.
బీజేపీకి ధైర్యం ఉంటే సర్నా ఆధ్యాత్మిక కోడ్ అమలు చేయాలన్న గిరిజనుల హక్కుల డిమాండ్ మీద ఆ పార్టీ వైఖరేమిటో చెప్పాలని కల్పనా సోరెన్ డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలుపై బీజేపీ వైఖరేమిటో చెప్పాలన్నారు. జార్ఖండ్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న సీఎం హేమంత్ సోరెన్ ఒక్కరేనన్నారు. వచ్చేనెల 13, 20 తేదీల్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. వచ్చేనెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.