Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 683 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి కొన్ని స్థానాలకు సాయంత్రం నాలుగు గంటల వరకు, మరికొన్నింట ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
జార్ఖండ్‌తో పాటు వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక ఇవాళే జరుగుతున్నది. రాహుల్ గాంధీ రాజీనామా నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇస్తున్నారు.
#WATCH | Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.
Visuals from a polling centre in Jamshedpur pic.twitter.com/cqSwJqSV6c
— ANI (@ANI) November 13, 2024
గిరిపుత్రులు ఎటు వైపో?
తొలి దశ పోలింగ్ జరగనున్న అన్ని స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. 2019 ఎన్నికల్లో ఈ 43 స్థానాల్లో 25 స్థానాలను జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలుచుకోగా, బీజేపీ కేవలం 13 స్థానాలను, స్వతంత్రులు రెండు స్థానాలను, ఎన్సీపీ ఒక్క సీటును, జేవీఎం ఒక్క సీటును దక్కించుకున్నాయి. 43 నియోజవకర్గాల్లో 20 ఎస్టీ రిజర్వుడ్, ఆరు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీటిల్లో 18 స్థానాలను కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమే దక్కించుకోగా, రెండింటిని మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలపై ఇండియా కూటమి భారీగా ఆశలు పెట్టుకున్నది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అరెస్టుపై సానుభూతి కలిసొస్తుందని భావిస్తున్నది. సొరేన్ సైతం ప్రధానంగా ఎస్టీల హక్కులనే ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. బీజేపీ కూడా గిరిజన ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించింది.
బరిలో ఇద్దరు మాజీ సీఎంల భార్యలు
తొలి దశ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంపయీ సొరేన్తో పాటు ఆరుగురు మంత్రులు, పలువురు కీలక నేతలు రంగంలో ఉన్నారు. నెల క్రితం జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన చంపయీ సొరేన్ మరోసారి సరైకెల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1991 నుంచి ఇక్కడ ఆయన ఆరుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయనపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిన గణేశ్ మహలి ఈసారి జేఎంఎం నుంచి పోటీ చేస్తుండటంతో ఈ నియోజవకర్గంలో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. రాంచి, జంషేడ్‌పూర్ పశ్చిమ, తూర్పు, జగన్నాథ్‌పూర్, లొహర్దగ, గర్హ్వా, చైబాసా, లతేహర్, పోట్క వంటి స్థానాలూ కీలకంగా మారాయి. జగన్నాథ్‌పూర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడా, పోట్ల నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా భార్య మీరా బీజేపీ నుంచి పోటీ చేస్తుండటంలో ఈ స్థానాలపై ఆసక్తి నెలకొన్నది.