లక్నో: ఆమె ఓ మాజీ ఎమ్మెల్యే. భర్త రైల్వే శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇకేం.. ఇద్దరూ కలిసి ఎంత సంపాదించొచ్చు.. సాధారంగా అందరికీ వచ్చే అనుమానమే ఇది. ఇలానే దొంగలూ ఆలోచించారు. వారి ఇంటిపై ఓ కన్నేశారు. అందులోనూ పని మనిషి తప్ప అక్కడ ఎవరూ ఉండటంలేదు. అదనుకోసం చూశారు. దీపావళి పండుగ వేళ వారూ పండుగ చేసుకున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే గారి ఇంటిని లూటీ చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, సమాజ్వాదీ పార్టీ నేత మధుబాల పాసికి (Madhubala Pasi).. జాన్పూర్లో ఇళ్లు ఉన్నది. ఆమె భర్త రైల్వే శాఖలో డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఈ నెల 3న తమ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అదే సమయంలో జాన్పూర్లో ఆమె నివాసంలో దొంగలు పడ్డారు.
వంట గది కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. బీరువాలో ఉన్న రూ.1.75 కోట్ల విలువైన నగదు, రూ.35 లక్షలు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఉదయాన గుర్తించిన పనిమనిషి రాజేశ్ యాదవ్ విషయాన్ని మధుబాలకు చేరవేశారు. దీంతో ఆమె అల్లుడు రకేశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిటికీలో నుంచి ఇంట్లోకి వచ్చిన దొంగలు ఖరీదైన నగలు, నగదు చోరీ చేశారని అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే ఇంట్లో లేరని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.