Road Accident | ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. వాహనం నదిలో పడిపోయిన సమయంలో అందులో 13 మంది వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. జీపు నదిలో పడగానే.. అందులో ఉన్న వారు అరుపులు, కేకలు వేయడం వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు.
ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ బోక్తాకు చెందినవారని తెలుస్తున్నది. ఈ ప్రమాదంపై సీఎం ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని.. ఈ బాధ నుంచి బయటపడేందుకు కుటుంబీకులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.