న్యూఢిల్లీ, నవంబర్ 12: జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా కేవలం 5.1 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత ఏడాది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన మొదటి రెండు వారాల్లో దాదాపు 12.21 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇంత భారీ తేడా ఉండటానికి సాంకేతిక సమస్యలే కారణమని నిపుణులు భావిస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతున్నదని చెప్తున్నారు. నవంబర్ 22 వరకే గడువు ఉన్నప్పటికీ ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎన్టీఏ సమీక్షించి వేగంగా దరఖాస్తు ప్రక్రియలో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.