న్యూఢిల్లీ, జనవరి 1: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(మెయిన్)-2025 సెషన్ 1 పరీక్షల షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాలతో పాటు భారత్ బయట 15 నగరాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 22 నుంచి పరీక్షలు మొదలవుతాయి. పేపర్ 1(బీఈ/బీటెక్) పరీక్ష జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్ 2బీ(బీ ప్లానింగ్), పేపర్ 2ఏ, 2బీ(బీఆర్క్, బీ ప్లానింగ్ రెండింటికి) పరీక్ష జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరగనుంది.