Murder Case : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ జన్‌సురాజ్ పార్టీ (JSP) కార్యకర్త దులార్‌చంద్ యాదవ్ (Dularchand Yadav) హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. జేడీయూ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ (Anant Singh) ను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా అనంత్ సింగ్ పట్నా జిల్లాలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దులార్ చంద్ హత్య నేపథ్యంలో పోలీసులు సింగ్‌పై నిఘాఉంచారు. ఆదివారం తెల్లవారుజామున బార్హ్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అనంత్ సింగ్ అనుచరులు మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్ అనే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించేందుకు పట్నాకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
మొకామాలో జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి ప్రచారం చేస్తుండగా జేడీయూ కార్యకర్తలతో జేఎస్పీ కార్యకర్తలకు గొడవ జరిగింది. అదే సమయంలో పీయూష్ మామ, పార్టీ కార్యకర్త దులార్ చంద్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య నేపథ్యంలో ఆగ్రహానికి గురైన పీయూష్ మద్దతుదారులు ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవీ కారుపై రాళ్లు రువ్వారు.
కాగా ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్ల నివారణలో విఫలమయ్యారన్న కారణంపై పట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సిహాగ్ను బదిలీ చేసింది. మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.