Court Martial | ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) కోర్ట్ మార్షల్‌కు గురయ్యాడు. ఈ అధికారికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ కోర్ట్ మార్షల్ తీర్పునిచ్చింది. ఓ మహిళా కెప్టెన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ జేసీఓపై ఆరోపణలు వచ్చాయి. సిక్కింలో విధుల్లో ఉన్న ఈ హవల్దార్ స్థాయి అధికారిని తొలగించాలని కూడా కోర్ట్ మార్షల్ సిఫారసు చేసింది.
ఆర్మీ అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఓ మహిళా కెప్టెన్ గత ఏడాది 17 మౌంటైన్ డివిజన్ ప్రాంతంలో రివర్ రాఫ్టింగ్ కోర్సు కోసం సిక్కిం వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. మహిళా అధికారికి గ్యాంగ్‌టక్‌లో అధికారిక నివాసం కేటాయించారు. ఆర్మీలో జేసీఓ స్థాయిలో పనిచేస్తున్న ఓ అధికారి మహిళా కెప్టెన్ ఉంటున్న గదిలోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు ఆ మహిళా అధికారి అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు నివేదించింది. నిందితుడిపై పలు అంశాలపై అభియోగాలు మోపారు. మహిళా కెప్టెన్ ఫిర్యాదు మేరకు సైన్యం వెంటనే విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో జేసీఓ దోషిగా తేలాడు.
కోర్ట్ మార్షల్ సిక్కింలోని 617 ఈఎంఈ బెటాలియన్‌లో జరిగింది. ఇందులో దోషిగా తేలిన జేసీఓకు ఏడాది జైలు శిక్షతోపాటు సర్వీసు నుంచి బర్తరఫ్ చేయాలని సిఫారసు చేసింది. ఈ కేసులో కోర్టు చైర్పర్సన్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ షాహి కాగా, ప్రాసిక్యూషన్ లాయర్‌గా అక్షిత్ ఆనంద్ వ్యవహరించారు. లైంగిక వేధింపుల విషయాల్లో భారత సైన్యం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. గత కొన్నేళ్లుగా ఇలాంటి కేసుల్లో పలువురు పురుష అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు.