వాషింగ్టన్ : భారత్‌లోని ‘సర్’ (ప్రత్యేక సమగ్ర సమీక్ష) లాగా అమెరికాలో ఓటర్ జాబితాలను నిశితంగా పరిశీలించడాన్ని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. ఇందుకోసం సుమారు రూ.125 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితాలను పరిశీలించి జాతీయ ఓటర్ డాటా బేస్‌ను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియలో అమెరికాలో నివసిస్తున్న 26 లక్షల మంది భారత సంతతి ఓటర్లలో 10 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అమెరికా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. ఈ ప్రక్రియ నిర్వహణను ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)కి ట్రంప్ అప్పగించారు. ఈ ప్రక్రియలో 50 రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించి, అప్డేట్ చేస్తారు. ఓటర్ల సమాచారాన్ని వివిధ ప్రభుత్వ రికార్డులతో సరి చూస్తారు. ఓటర్ల జాబితాలను కంప్యూటర్లు ఇమ్మిగ్రేషన్, ఇతర రికార్డులతో సరి చూస్తాయి. ఒక పేరు లేదా సమాచారం రికార్డులతో సరిపోలకపోతే, ఆ ఓటర్ వివరాలను పునఃతనిఖీ చేస్తారు. అలాంటి వాళ్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రమాదముంది.
న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి రాష్ర్టాల్లో భారత సంతతి ఓటర్లు, వారి రాజకీయ ప్రభావం చెప్పుకోదగ్గ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఓటర్ల వెరిఫికేషన్, నమోదు ప్రక్రియ నిబంధనలు ప్రతి రాష్ర్టానికీ వేర్వేరుగా ఉన్నాయి. అయితే తాజా ప్రక్రియలో రికార్డులను పరిశీలిస్తుండటంతో భారత సంతతి ఓటర్లు కూడా స్క్రూటినీ చేయబడతారు. భారత సంతతి ఓటర్ల ఓటింగ్ సరళిని కూడా తాజా ప్రక్రియలో పర్యవేక్షించవచ్చని తెలుస్తున్నది. అయితే ఎంత మంది పేర్లను వాస్తవంగా తొలగిస్తారనేది ప్రక్రియ పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. మరోవైపు ఓటర్ గుర్తింపు కార్డును దేశవ్యాప్తంగా అమలు చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నది. అమెరికన్ ఓటర్ అర్హత చట్టం ప్రతిపాదిత బిల్లు ద్వారా ఓటర్ల రిజిస్ట్రేషన్, ఓటింగ్ నిబంధనలను కఠినం చేయాలని యోచిస్తున్నది.