అగర్తలా: ఒక జవాన్‌కు రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. ఇద్దరు కుమార్తెలు కావడంతో కొడుకు పుట్టలేదని అసంతృప్తి చెందాడు. ఈ నేపథ్యంలో ఏడాది వయస్సున్న కూతురుకు విషం ఇచ్చి చంపాడు. (Jawan Poisons Daughter) త్రిపురలోని ఖోవై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టీఎస్ఆర్) పదో బెటాలియన్‌కు చెందిన జవాన్ రతీంద్ర దేబ్బర్మ, ఏడీసీ ఖుముల్వంగ్ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. రెండో సంతానంగా కుమారుడు కావాలని భావించాడు. అయితే ఆడపిల్ల పుట్టడంతో చాలా అసంతృప్తిగా ఉన్నాడు.
కాగా, ఆగస్ట్ 8న భార్య సోదరి గ్రామమైన బెహలబరికి వారు వెళ్లారు. మరదలు కొడుకు, ఏడాది వయస్సున్న తన కుమార్తెకు బిస్కెట్లు కొనేందుకు ఒక షాపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తన కూతురికి విషం తినిపించాడు. దీంతో ఆ చిన్నారి వాంతులు, విరోచనాలతో అనారోగ్యం పాలైంది. తొలుత ఖోవై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత రాజధాని అగర్తలలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ పసిపాప చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా విష ప్రయోగం వల్ల మరణించినట్లు నిర్ధారణ అయ్యింది.
మరోవైపు భర్త రతీంద్ర దేబ్బర్మ తన కుమార్తెకు విషం ఇచ్చి హత్య చేశాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూతురితోపాటు తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. తన భర్తకు ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జవాన్ రతీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Cat Kumar | బీహార్‌లో నివాస ధృవీకరణ పత్రం కోసం.. ‘క్యాట్ కుమార్’ దరఖాస్తు
Girl Immolate | నిప్పంటించుకుని మరో బాలిక మృతి.. ఒడిశాలో నాలుగో సంఘటన
Watch: ఎదురుపడిన మనిషి, సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?